29, ఏప్రిల్ 2011, శుక్రవారం

అరుణోదయ నాగన్న, ఇల్లందు వెంకన్న

ఎ.జనార్ధన్
తెలంగాణలో చాలా మంది కళాకారులకు పేదరికం, పరిసరాలే పాట నేర్పుతయి. దానికి అచ్చమైన ఆనవాలు నాగన్న. అలుపెరగని ఉద్యమ సైనికుడిలా కదంతొక్కుతున్న నాగన్న ప్రస్థానం ఒక్కరోజుది కాదు. ఆయన పాటలు సంఘర్షణల్లోంచి పుట్టినయి. అవి ఇప్పటికీ సమాధానం కోసం నేటికి వెతుకుతూనే ఉన్నయి. నాగన్న పాట వారసత్వం గానే పుట్టింది. తన తండ్రి, తన ఊరు నాగన్నకు పాట నేర్పినయి. ఉద్యమం నాగన్న పాటకు పదును పెట్టింది.. ఉద్యమమే ఊపిరి నిజాయితీ అతని నినాదం. అందుకే పుటకతో వచ్చిన పుట్టెడు కష్టాలు ఇంకా ఆస్తులుగానే మిగిలి ఉన్నయి.
స్పాట్
నాగన్న కలం రాయని జానపద గీతం లేదు..గళమెత్తని ఉద్యమగీతం లేదు..ఇన్ని పాటలను అలవోకగా తన గళంలో జాలువార్చిన నాగన్న పుట్టింది ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం రాజారం గ్రామం. తండ్రి తాతయ్య, తల్లి లక్ష్మమ్మ. నాగన్న పుట్టింది పేదరిక కుటుంబంలోనే. తండ్రి పాటల వారసత్వమే నాగన్నకు అబ్బింది. సాంస్కృతిక కళలంటే నాగన్నకు ప్రాణం. ఆ రక్తంలోనే ఆ వాసనలున్నయి కాబట్టే ఎక్కడ బాగోతం జరిగినా, జానపద కళారూపాల ప్రదర్శలిస్తున్నా కాలికి పనిచెప్పేవాడు. కోలాటం ఆడినా, ఒగ్గుకథ చెప్పినా నాగన్నకు ఆయనే సాటి. నాగన్న కళాసంపత్తి ఒక్క పాటరాయడం దగ్గరే ఆగలేదు. బాగోతాలు, శారద, పిచ్చకుంట్ల బుర్రకథలు, పొడపత్ర, బైకాళి, ఒగ్గు కథలతో బాటు, ఉపకుల వృత్తుల కళారూపాలు కూడా ప్రదర్శించేవాడు. నాగన్న ఉత్సాహానికి ఊపిరిలూదిన కళాకారుడు కానూరి వెంకటేశ్వర్ రావు. ఆయనే తనకు స్పూర్తి అని చెప్పుకుంటడు నాగన్న..
స్పాట్
నాగన్న పాటను ముందు ఊరే హత్తుకుంది. వ్యవసాయ పనుల్లో తన పాటలతో రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్నించేవాడు. చేలు చెలకలు, పైరగాలులు నాగన్న పాటకు తాళం వేసేవని చెప్పుకుంటరు. నాగన్నపాటల్లో అణిచి వేతను ప్రశ్నించే నాదముంటది. తిరగబడమనే నినాదముంటది. 1975 నుంచి విప్లవ గీతాలను ఆలపిస్తూ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నడు. ఎమర్జెన్సీ సమయంలో కూడా అనేక సార్లు అరెస్టయి జైలు జీవితాన్నిగడిపిండు నాగన్న. అరుణోదయ సాంస్కృతిక సంస్థలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ర్టవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చి ప్రజాచైతన్యం కోసం పాటుబడ్డడు. అన్నామరుడురా మన రామనరసయ్య అన్నపాట నాగన్నకు రాష్ర్టస్థాయి గుర్తింపు తెచ్చింది.
స్పాట్
నాగన్న బుర్ర కథలు చెప్పడంలో, భూబాగోతాలు ఆడటంలో సిద్దహస్తుడు. నాగన్న ఉద్యమించని ప్రజా సమస్యలేదు. మద్యనిషేదం, బూటకపు ఎన్కౌంటర్లు, విద్యుత్ చార్జీలు, తెలంగాణపోరాటం వంటి అనేక ఉద్యమాల్లో కీలక పాత్రపోషించిండు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నాగన్న గజ్జకట్టి గళమెత్తి ఊరూవాడా తిరిగిండు. ధూంధాం ల ద్వారా తెలంగాణ పల్లెపల్లెనా చైతన్యం తెచ్చి మన తెలంగాణ మనకు వచ్చేదాకా విశ్రమించేది లేదని నినదించిండు. నాగన్న పాటలు అశేషప్రజానికం చేత ఆదరించబడ్డయి. అందుకే ఆర్ నారాయణ మూర్తి తన సినమాల్లో నాగన్నపాటలను జోడించిండు. చలో అసెంబ్లీ, దండోర చిత్రాలలో నాగన్న రాసిన పాటలు పల్లెపల్లెనా ఉద్యమ పరిమళాలు వెదజల్లినయి..అవే స్వరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రవహిస్తున్నయి.
స్పాట్(ఇక్కణ్నుంచి వెంకన్న)
ఎల్ వెంకన్న...కలాన్ని గళాన్ని నమ్ముకున్న పల్లెపాటల విలుకాడు పుట్టింది నల్లగొండ జిల్లా నూతన్ కల్ మండలం ఎర్రపహాడ్ గ్రామం. తల్లి వెంకటమ్మ, తండ్రి నాగయ్య. స్కూల్ స్థాయిలోనే విద్యార్ధి ఉద్యమంలో పాల్గొన్నడు. అదే పంథా నేటికీ కొనసాగిస్తున్నడు. 1986నుంచి అరుణోదయ సాంస్కృతిక సంస్థలో చురుకుగా పని చేస్తున్న వెంకన్న ఇప్పటికి ఎన్నోపాటలు రాసిండు. వెంకన్నపాటలకు జానపద కళారూపాలే ఆయువు పోసినయి. ఆయన రాసిన ప్రతి పాటా పల్లె ప్రజల గుండెసడిని వినిపిస్తది. దగాపడ్డ తమ్ముళ్లు, చెరచబడ్డ చెల్లెళ్లు, దోపిడి గురైన రైతులు, ఆక్రందించిన అడవిబిడ్డలు. ఒకటేమిటి వెంకన్నతడమని సమస్యలేదు. రాయని గీతం లేదు. వెంకన్నరాసిన ఎల్లియాలో ఎల్లన్న అనే పాట ఆయనకు రాష్ర్టస్థాయి గుర్తింపునిచ్చింది. వెంకన్నపాటలు ఎన్నో ఆడియో సిడిలలో ఇమిడి పోయి ఇంటింటా సుప్రబాతాలయినయి. తన మొదటి సిడి చక్కాని నా పల్లె ఎంతో ఆధరణ పొందింది. ఆ తరువాత ఎన్నో పాటలు తన కలం నుండి ఒక ప్రవాహంలా వస్తూనే ఉన్నయి. తెలంగాణ ఉద్యమంలో వెంకన్న కీలక పాత్రమరువలేనిది. ఆయన తన ఆట పాట ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఒక పాత్రికేయునిగా ప్రపంచానికి తన పలుకులు వినిసిస్తున్నడు వెంకన్న.
స్పాట్
పల్లెపాటల ద్వారా, ఉద్యమగీతాల ద్వారా మరుగున పడ్డ మన సంస్కృతిని బతికిస్తున్న నాగన్న వెంకన్న లాంటి కళాకారులు మనకు సాంస్కృతిక వారసత్యం ఇస్తున్నరు. ఇగిరిపోతున్న ఉపవృత్తుల కళారూపాలను, జానపదకళలను బతికించుకోవాలంటే మనకు మరింత మంది నాగన్నలు వెంకన్నలే కాదు..కొత్త వారు పుట్టుకురావాలి. వారికి స్పూర్తి నిచ్చేదే ఈనాటి ఎవర్ ష్యూర్ మాటా ముచ్చట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి