29, ఏప్రిల్ 2011, శుక్రవారం

కొండయ్య. నత్తి సత్తి

ఎ. జనార్ధన్
వాయిస్
పల్లెదనాన్ని ఒళ్లంతా నింపుకొని పాదచారిలా, పాటచారిలా వెళుతున్న ఈ గ్రామీణ కళాకారుడి పేరు.కొండయ్య.. కొండయ్యది మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామం. తండ్రి రాములు, తల్లి సత్తెమ్మ. చిన్నతనం నుంచే పాట పాడటమంటే మహాసరదా.. పాట కొండయ్యకు వారసత్వం కాదు. ఈయన పాటలకు ప్రకృతే గురువు.. సంగీత పరిజ్ఞానం లేని కొండయ్య వినసొంపైన బాణీలు కట్టడంలో దిట్ట. అంతేకాదు.. ఆ బాణీలలో పల్లెతనాన్ని పలరించే పదాలను చిలకరించి కొత్త రూపం తెస్తడు కొండయ్య. అందుకే ఆయన పాటలు పల్లెపల్లెనా పల్లవించినయి. గొంగడి భుజాన వేసుకొని మూగజీవాలతో మనసులో మాటలు చెప్పుకునే కొండయ్యకు మొదటి ప్రేక్షకులు కూడా అవే.. కంజీరా చేతిలో పట్టుకొని గంగా ప్రవాహాల్లాంటి పాటలను పలికిస్తుంటే గోరువంకలు, చిలకమ్మలు కొండయ్య పాటకు కోరస్ పలుకుతయి.
స్పాట్( బ్యాగ్రౌండ్ ..చిలకమ్మ..చిలకమ్మా..)
జానపదాలంటే ప్రాణమిచ్చే కొండయ్య వాటికి ప్రాణం పోయాలని ఉబలాట పడ్డడు. కాలగర్బంలో కలిసిపోతున్న జానపదాలకు జీవంపోయాలని.. తాను ప్రాణంగా చూసుకొనే గొర్రెలనమ్మి ఆడియో సిడి చేసిండు. ఆ పాటలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది కానీ గొర్రెల మందను తిరిగి తెచ్చుకోలేని పేదరికం మాత్రం అట్లనే మిగిలింది. పేదరికంలో ఉండి కూడా పాటలను బతికించాలను కున్న కొండయ్య మరో ఆడియో సిడికి చేసేందుకు సిద్దపడుతున్నడు. కొండయ్య పాటలు పసిడి కొండల్లా పదికాలాల పాటు నిలవాలని కోరుకుంటున్నరు ఆయన అభిమానులు.
2వస్టోరీ.
వాయిస్
పాట పాడాలంటే మంచి స్వరం..చక్కని ఉచ్చారణ కావాలి అని అనుకుంటరు. కానీ అవేవీ లేకపోగా మాట మాట్లాడటమే కష్టంగా మారిన వ్యక్తి సత్యనారాయణ. మాటలు స్పష్టంగా మాట్లాడలేని నత్తి ఆయనకు శాపంగా మారింది. అయినా ఆయన పాటలు పాడాలన్న తన లక్ష్యాన్ని వదులు కోలేదు. వైకల్యాన్ని అధిగమించి పాటను సొంత చేసుకున్న సత్యనారాయణది మహబూబ్ నగర్ జిల్లా అమరచింత గ్రామం. ఇప్పడిక సత్యనారాయణ పాటల సత్తిగా అందరికీ చిరపరిచయం. పాటల సత్తిగా మారడానికి సత్యం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీకావు. ఎందుకంటే సత్యనారాయణ పుట్టగానే గాయకుడు కాదు. తాపీ మేస్ర్తీ వృత్తి. అప్పుడప్పుడు పశువులు కాసుకునే వాడు. పశువులు కాసుకునే వాడికి పాటేంటని ఎగతాళి చేసిన్రు. అంతేకాదు మాటే సరిగా రాని సత్యానికి పాటకూడానా అని హేళన చేసిన్రు. ఆ మాటలు సత్యనారాయణలో మరింత బలాన్ని పెంచినయి. ఎలాగైనా పాట పాడి తీరాలనుకున్నడు. తనలో దాగిన కళను వెలికి తీసేందుకు కఠోర శ్రమ చేసిండు. ఖాళీ సమయాల్లో పాట ప్రాక్టీస్ చేసిండు. ఆయన చేసిన శ్రమ ఫలితంగా నేడు ఆయన ఇంటి పేరే పాటగా మారింది. ఒకప్పుడు నత్తి సత్తి అన్నవాళ్లే నేడు కత్తిలాంటి పాటల సత్తి అంటున్నరు. అయినా గతాన్ని తవ్వి గుర్తుచేసుకొనే ఓపికా, తీరికా సత్యానికి లేదు. ఎందుకంటే తన ఏరియాలో ఎక్కడ ధూంధాం జరిగినా.. మీటింగులు జరిగినా మొదటి పాట సత్యానిదే..వైకాల్యాన్ని అధిగమించి కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న సూత్రానికి సత్యమే ప్రత్యక్ష నిదర్శనం.
స్పాట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి