29, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి