29, ఏప్రిల్ 2011, శుక్రవారం

రసమయి బాలకిషన్ (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ.జనార్ధన్
తెలంగాణ పల్లెసిగలో సాహిత్య మందారాలు పరిమళిస్తయి. అందులో మొగ్గగానే మగ్గిపోయిన జానపదాలు కొన్నైతే.. ఉద్యమాల బాటలో రాలిపోయిన మౌన రాగాలు కొన్ని. ఆ ఆవేదనలను గుండెకు హత్తుకొనేలా వినిపించే వాడే కళాకారుడు. అటువంటి కళాకారులకు తెలంగాణ మాగణమే కాణాచి.ఆ మట్టిలోంచి పుట్టిన సాహత్యమాణిక్యమే రసమయి బాలకిషన్..
స్పాట్
రసయయి బాలకిషన్.. తెలంగాణ సాహిత్యాభిమానులందరికీ బాగా పరిచయం ఉన్న పేరు. ఆ మాట కొస్తే ఏ చిన్న పిల్లవాణ్ని అడిగిన ఆయన పేరు ఇట్టే చెప్పేస్తరు. ఎందుకంటే ఆయన మాటటు మంత్రాల్లా ఆకట్టుకుంటయి. ఆ పదాల్లో వశీకరణ సూత్రాలు తొణికిసలాడుతుంటయి. ఒక విషయాన్ని విప్పిచెప్పాలంటే రసమయికి సాటిలేరు. ఎందుకంటే ఆయన చెప్పే పిట్టకథయినా కట్టుకథయినా మనసుకు హత్తుకొని తీరాల్సిందే. ఇక తెలంగాణ పాటకు ప్రాణం పోసి..వాటిని ఇంటింటా సుప్రబాతాల్లా సవ్వ్డడి చేయించడం రసమయికే చెల్లింది. మన మట్టిలో మరుగున పడ్డ జానపదాలకు జీవజలాన్ని గుప్పించి జలపాతంలా దుంకించడంలో రసమయి కూడా తనవంతు పాత్రపోషించిండు.
స్పాట్
తెలంగాణ ఉద్యమంలో పాటే ఆయుధం..ఉడుకెత్తించే నాలుగు మాటలకన్నా ఒక్కపాట పరుగులెత్తిస్తది. అలా ఉద్యమంలోకి ఉరుకులు పెట్టించడంలో రసమయి అందెవేసిన చేయి. వృత్తి రీత్యా ఉపాద్యాయుడు కావడం వల్ల విషయాన్ని విపులంగా చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ కదిలే జానపదాల గ్రంధాలయం పుట్టింది మెదక్ జిల్లా సిద్దిపేట మందలం రావురూకల గ్రామం..రసమయి అసలు పేరు వేల్పుల బాలకిషన్. జానపదాలన్నా గ్రామీణ వాతావరణమన్నా, అచ్చమైన తెలంగాణ యాసన్నా ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఇంటర్ లోనే రసమయి అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసిండు. ఆ సంస్థ పేరే తరువాత ఇంటి పేరయింది.
స్పాట్
రసమయి ఒక్క తెలుగులోనే కాదు కన్నడంలో కూడా పాడగలడు. తెలంగాణ ఉద్యమంలో రసమయి పాత్రమరవలేనిది. ఆయన పాల్గొన్న ఉద్యమ సభ ఏదైనా సరె వలస పాలకుల ధోకాను విప్పి చెప్పేవాడు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న పరవళ్లు పంట పొలాల్లో ఎందుకు లేవో వివరిస్తడు. బడుగు జీవుల బతుకులెట్లున్నయో గుండె గొంతుకలోంచి వినిపిస్తడు. నిజ జీవితంలో రగిలిన నిట్టూర్పులను ఒడిసిపట్టిండు కాబట్టే ఉద్యమ సెగలను పల్లెపల్లెనా పంచిపెట్టిండు. తెలంగాణ ధూంధాం పేరుతో కళాకారలందరి గళాలను ఒక్కవేదిక పైకి తెచ్చిండు. కామారెడ్డిలో కదిలిన ధూంధాం పల్లెపల్లెకూ విస్తరించింది. ఉద్యమ సభలన్నీ ఇవాళ ధూంధాం లేకుండా జరగట్లేదంటే దానికి తాను వేసిన పునాదే కారణమంటడు బాలకిషన్.
స్పాట్
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు. అదే స్పూర్తితో ఇప్పుడు రసమయి యమలోకంలో జైతెలంగాణ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడు. ఈ సినిమా దాదాపు పూర్తయి సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లబోతోంది.
స్పాట్
పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు. అరెస్టులు, జైళ్లు ఆయనకు మామూలే. తెలంగాణ ఉద్యమానికి ఒక సైనికుడి మాదిరిగా పనిచేసిండని చెప్తరు ఆయన గురించి తెలిసన వాళ్లు. నవ రసాలను ఒలికింప జేయగల రసమయి రాగాలు మరిన్ని పూయాలి. అవి తెలంగాణ మాగాణంలో వెల్లి విరియాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి