29, ఏప్రిల్ 2011, శుక్రవారం

శనిగరం బాబ్జి (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ.జనార్దన్
డప్పు దరువుతో, తెలంగాణ దండోరా వేస్తున్న ఈ గాయకుడి పేరు శనిగరం బాబ్జి.. వందలాది ఉద్యమసభల్లో గజ్జకట్టి గళమెత్తిన బాబ్జి పుట్టింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్. తండ్రి రామయ్య, తల్లి లచ్ఛమ్మ. పాఠశాల వయసు నుంచే పాట పాడటం నేర్చుకున్నడు. నాటి నుంచి నేటి వరకు ఎన్నో రకాల జానపద పాటలకు, ఉద్యమ గేయాలకు బాబ్జీ గళం ప్రాణం పోసింది.
స్పాట్
శనిగరం బాబ్జి మొదట్లో నాస్తికత్వం పై అనేక ప్రదర్శనలిచ్చిండు. మూఢనమ్మకాల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు ఎన్నో వేదికల పై తన ప్రదర్శనలిచ్చిండు. నోట్లో మంటలు పుట్టించడం, నిప్పులపై నడక వంటి ప్రదర్శనలతో ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసిండు. తాను ఆదర్శంగా ఉండి ప్రజలకు ఆదర్శాల గురించి చెప్పాలని కులాంతర వివాహం చేసుకుండు. కమలాపూర్ మండలం కన్నూర్ గ్రామానికి చెందిన అరుణను కులాంతర వివాహం చేసుకున్నడు. బాబ్జి ఒక్క తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చి మేథావుల చేత ప్రశంసలందుకున్నడు.
స్పాట్
తెలంగాణలో జరుగుతున్న దోపిడి గురించి అనేక ధూంధాం సభల్లో నినదించిండు. ఓపెన్ కాస్ట్ గనుల పేర జరుగుతున్నదోపిడిని విన్పించిండు. తెలంగాణ నీళ్ళను తరలించుకు పోయే ప్రాజెక్ట్ లకు వ్యతిరేకంగా చేసిన పాదయాత్రలో పాల్గొన్నడు. గత పద్నాలుగేళ్లుగా తన గళమాధుర్యంతో ఎన్నో పాటలు పాడి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నడు శనిగరం బాబ్జి..

బచ్చలకూరి శ్రీనివాస్ (తెలంగాణ ఉద్యమ గళం)

స్పాట్
బచ్చలకూరి శ్రీనివాస్.. తెలంగాన ఉద్యమంలో గజ్జ కట్టి గళమెత్తిన కళాకారుడు. స్వరాష్ర్ట సాధనకోసం జనమంతా ఒక్కటవ్వాలని తన ఆటా పాటా ద్వారా పిలుపునిచ్చిండు. శ్రీనివాస్ పుట్టింది నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ముల్కనూర్ గ్రామం. డిగ్రీ వరకు చదువు కున్న శ్రీనివాస్ కు పాటంటే ప్రాణం. చిన్నతనం నుంచే పాటలు పాడటమంటే చాలా ఇష్టం. ఎక్కడ సామాజిక చైతన్య కార్యక్రమాలు జరిగినా హాజరయి అక్కడ తన గళాన్ని వినిపించేవాడు. జనవిజ్ఞాన వేదిన నిర్వహించే అనేక ప్రజాచైతన్య కార్యక్రమల్లో పాల్గొనేవాడు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న తరుణంలో వేలాది గళాల్లో తానూ ఒక గళమయిండు. ఎన్నో కేసెట్లలో పాడిండు. తానే స్వయంగా తెలంగాణ ప్రజాగళం అనే సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ధూంధాంలలో పాల్గొంటున్నడు. ఒక్క ఉద్యమగీతాలే కాక వారసత్వంగా వచ్చిన యక్షగానం కూడా పాటగలడు.తెలంగాణ వచ్చేదాకా తాము ఈ ఉద్యమగీతాన్ని అలుపెరగక ఆలపిస్తూనే ఉంటనని చెబుతున్నడు శ్రీనివాస్.
స్పాట్
తెలంగాణ ప్రజా ఉద్యమంలో నేను సైతం అంటూ గజ్జకట్టిన మరో తెలంగాణ కలికితురాయి విఠల్ రెడ్డి. ఈయన పుట్టింది నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల గ్రామం. విఠల్ రెడ్డికి చిన్నతనం నుంచే సంగీతమంటే ఇష్టం. ఆ మక్కువ తోనే సంగీతం నేర్చుకున్నడు. తెలంగాణ వెనకబాటు తనానికి కారణమేంటో ప్రత్యక్షంగా చవిచూసిండు. అందుకే తాను పడ్డ కష్టాలు ముందు తరానికి రాకూడదని తన పాటను ఆయుధంగా చేసుకొని ఉద్యమ పథలో ధూకిండు. ఎక్కడ ధూంధాం జరిగినా హాజరవడమే కాదు, తానే సొంతంగా దగాపడ్డ తెలంగాణ అనే సి.డి రూపొందించిండు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నడు.
స్పాట్

అరుణోదయ నాగన్న, ఇల్లందు వెంకన్న

ఎ.జనార్ధన్
తెలంగాణలో చాలా మంది కళాకారులకు పేదరికం, పరిసరాలే పాట నేర్పుతయి. దానికి అచ్చమైన ఆనవాలు నాగన్న. అలుపెరగని ఉద్యమ సైనికుడిలా కదంతొక్కుతున్న నాగన్న ప్రస్థానం ఒక్కరోజుది కాదు. ఆయన పాటలు సంఘర్షణల్లోంచి పుట్టినయి. అవి ఇప్పటికీ సమాధానం కోసం నేటికి వెతుకుతూనే ఉన్నయి. నాగన్న పాట వారసత్వం గానే పుట్టింది. తన తండ్రి, తన ఊరు నాగన్నకు పాట నేర్పినయి. ఉద్యమం నాగన్న పాటకు పదును పెట్టింది.. ఉద్యమమే ఊపిరి నిజాయితీ అతని నినాదం. అందుకే పుటకతో వచ్చిన పుట్టెడు కష్టాలు ఇంకా ఆస్తులుగానే మిగిలి ఉన్నయి.
స్పాట్
నాగన్న కలం రాయని జానపద గీతం లేదు..గళమెత్తని ఉద్యమగీతం లేదు..ఇన్ని పాటలను అలవోకగా తన గళంలో జాలువార్చిన నాగన్న పుట్టింది ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం మండలం రాజారం గ్రామం. తండ్రి తాతయ్య, తల్లి లక్ష్మమ్మ. నాగన్న పుట్టింది పేదరిక కుటుంబంలోనే. తండ్రి పాటల వారసత్వమే నాగన్నకు అబ్బింది. సాంస్కృతిక కళలంటే నాగన్నకు ప్రాణం. ఆ రక్తంలోనే ఆ వాసనలున్నయి కాబట్టే ఎక్కడ బాగోతం జరిగినా, జానపద కళారూపాల ప్రదర్శలిస్తున్నా కాలికి పనిచెప్పేవాడు. కోలాటం ఆడినా, ఒగ్గుకథ చెప్పినా నాగన్నకు ఆయనే సాటి. నాగన్న కళాసంపత్తి ఒక్క పాటరాయడం దగ్గరే ఆగలేదు. బాగోతాలు, శారద, పిచ్చకుంట్ల బుర్రకథలు, పొడపత్ర, బైకాళి, ఒగ్గు కథలతో బాటు, ఉపకుల వృత్తుల కళారూపాలు కూడా ప్రదర్శించేవాడు. నాగన్న ఉత్సాహానికి ఊపిరిలూదిన కళాకారుడు కానూరి వెంకటేశ్వర్ రావు. ఆయనే తనకు స్పూర్తి అని చెప్పుకుంటడు నాగన్న..
స్పాట్
నాగన్న పాటను ముందు ఊరే హత్తుకుంది. వ్యవసాయ పనుల్లో తన పాటలతో రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రత్నించేవాడు. చేలు చెలకలు, పైరగాలులు నాగన్న పాటకు తాళం వేసేవని చెప్పుకుంటరు. నాగన్నపాటల్లో అణిచి వేతను ప్రశ్నించే నాదముంటది. తిరగబడమనే నినాదముంటది. 1975 నుంచి విప్లవ గీతాలను ఆలపిస్తూ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నడు. ఎమర్జెన్సీ సమయంలో కూడా అనేక సార్లు అరెస్టయి జైలు జీవితాన్నిగడిపిండు నాగన్న. అరుణోదయ సాంస్కృతిక సంస్థలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ర్టవ్యాప్తంగా అనేక ప్రదర్శనలిచ్చి ప్రజాచైతన్యం కోసం పాటుబడ్డడు. అన్నామరుడురా మన రామనరసయ్య అన్నపాట నాగన్నకు రాష్ర్టస్థాయి గుర్తింపు తెచ్చింది.
స్పాట్
నాగన్న బుర్ర కథలు చెప్పడంలో, భూబాగోతాలు ఆడటంలో సిద్దహస్తుడు. నాగన్న ఉద్యమించని ప్రజా సమస్యలేదు. మద్యనిషేదం, బూటకపు ఎన్కౌంటర్లు, విద్యుత్ చార్జీలు, తెలంగాణపోరాటం వంటి అనేక ఉద్యమాల్లో కీలక పాత్రపోషించిండు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో నాగన్న గజ్జకట్టి గళమెత్తి ఊరూవాడా తిరిగిండు. ధూంధాం ల ద్వారా తెలంగాణ పల్లెపల్లెనా చైతన్యం తెచ్చి మన తెలంగాణ మనకు వచ్చేదాకా విశ్రమించేది లేదని నినదించిండు. నాగన్న పాటలు అశేషప్రజానికం చేత ఆదరించబడ్డయి. అందుకే ఆర్ నారాయణ మూర్తి తన సినమాల్లో నాగన్నపాటలను జోడించిండు. చలో అసెంబ్లీ, దండోర చిత్రాలలో నాగన్న రాసిన పాటలు పల్లెపల్లెనా ఉద్యమ పరిమళాలు వెదజల్లినయి..అవే స్వరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రవహిస్తున్నయి.
స్పాట్(ఇక్కణ్నుంచి వెంకన్న)
ఎల్ వెంకన్న...కలాన్ని గళాన్ని నమ్ముకున్న పల్లెపాటల విలుకాడు పుట్టింది నల్లగొండ జిల్లా నూతన్ కల్ మండలం ఎర్రపహాడ్ గ్రామం. తల్లి వెంకటమ్మ, తండ్రి నాగయ్య. స్కూల్ స్థాయిలోనే విద్యార్ధి ఉద్యమంలో పాల్గొన్నడు. అదే పంథా నేటికీ కొనసాగిస్తున్నడు. 1986నుంచి అరుణోదయ సాంస్కృతిక సంస్థలో చురుకుగా పని చేస్తున్న వెంకన్న ఇప్పటికి ఎన్నోపాటలు రాసిండు. వెంకన్నపాటలకు జానపద కళారూపాలే ఆయువు పోసినయి. ఆయన రాసిన ప్రతి పాటా పల్లె ప్రజల గుండెసడిని వినిపిస్తది. దగాపడ్డ తమ్ముళ్లు, చెరచబడ్డ చెల్లెళ్లు, దోపిడి గురైన రైతులు, ఆక్రందించిన అడవిబిడ్డలు. ఒకటేమిటి వెంకన్నతడమని సమస్యలేదు. రాయని గీతం లేదు. వెంకన్నరాసిన ఎల్లియాలో ఎల్లన్న అనే పాట ఆయనకు రాష్ర్టస్థాయి గుర్తింపునిచ్చింది. వెంకన్నపాటలు ఎన్నో ఆడియో సిడిలలో ఇమిడి పోయి ఇంటింటా సుప్రబాతాలయినయి. తన మొదటి సిడి చక్కాని నా పల్లె ఎంతో ఆధరణ పొందింది. ఆ తరువాత ఎన్నో పాటలు తన కలం నుండి ఒక ప్రవాహంలా వస్తూనే ఉన్నయి. తెలంగాణ ఉద్యమంలో వెంకన్న కీలక పాత్రమరువలేనిది. ఆయన తన ఆట పాట ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఒక పాత్రికేయునిగా ప్రపంచానికి తన పలుకులు వినిసిస్తున్నడు వెంకన్న.
స్పాట్
పల్లెపాటల ద్వారా, ఉద్యమగీతాల ద్వారా మరుగున పడ్డ మన సంస్కృతిని బతికిస్తున్న నాగన్న వెంకన్న లాంటి కళాకారులు మనకు సాంస్కృతిక వారసత్యం ఇస్తున్నరు. ఇగిరిపోతున్న ఉపవృత్తుల కళారూపాలను, జానపదకళలను బతికించుకోవాలంటే మనకు మరింత మంది నాగన్నలు వెంకన్నలే కాదు..కొత్త వారు పుట్టుకురావాలి. వారికి స్పూర్తి నిచ్చేదే ఈనాటి ఎవర్ ష్యూర్ మాటా ముచ్చట.

తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్

యాంకర్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ బిడ్డలు తరాల సంది పడుతున్న తండ్లాటను కండ్లార చూసి చలించిన మేథావి. ఆయన పుట్టింది పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామం..ఈ బుద్దిశాలిని కన్న ధన్యజీవులు లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జయశంకర్ బడుగు జీవుల బతుకు దెరువులను అతి దగ్గరనుంచి గమనించిండు..అందుకే ఆయన తొలి అడుగు నుంచి నేటి వరకు దగా పడ్డ బతుకులకు బాసటగా నిలిచిండు.
స్పాట్
జయశంకర్ ప్రస్థానం ఉపాధ్యాయ వృత్తితో మొదలయింది.. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్ జిల్లాలలో టీచర్ గా పనిచేసిన్రు. తెలంగాణ అన్ని జిల్లాలతో ఆయనకు అనుబంధం ఉంది..ఉపాధ్యాయ వృత్తినుంచే అంచలంచలుగా లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా ఎదిగిండు. అంతేకాక సీఫెల్, కాకతీయ యూనివర్సిటీ లకు రిజిస్ర్టార్ గా పనిచేసిన్రు. 1991 నుంచి 1994వరకు కాకతీయ యూనివర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వహించిన్రు. ప్రధాని మన్మోహన్ సింగ్ జయశంకర్ గారి ప్రతిభను గుర్తించి 2004లో జాతీయ అసంఘటిత రంగ కమీషన్ కు లో నియమించిండు. తరువాత కాలంలో ఆపదవికి తనే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండు.
స్పాట్
జయశంకర్ గారు తెలంగాణ ఎట్ల కన్నీళ్లు పెడుతున్నదో దగ్గర్నుంచి చూసిన్రు. తరగతి గదులకే పరిమితం కాలేదు. తెలంగాణ బిడ్డలు పడుతున్న కడగండ్లకు కారణమేంటో విప్పిచెప్పిండు.. తెలంగాణ బిడ్డలను ఎట్ల ధోకా చేస్తున్నరో తెలిపిండు. ఆయన అనుభవాలు వందల పిహెచ్ డిలతో సమానం..ఆయన స్పృషించని అంశంలేదు.. తెలంగాణ బిడ్డల యాతనకు మూలాలను శోధించిండు. నీళ్లల్లో, నిధులల్లో, ఉద్యోగాలలో సీమాంధ్ర నాయకులు ఎట్ల మోసపుచ్చుతున్నరో తెలిపిండు. తెలంగాణ సంస్కృతి పైనా, బాష పైన దాడెట్ల జరుగుతుందో అక్షరీకరించింన్రు.. ఆయన రాసిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ విస్త్రుత అంగీకారం, తెలంగాణలో ఏమి జరుగుతుంది వంటి పుస్తకాలలో తెలంగాణ గతం, వర్తమానం కనిపిస్తయి.
స్పాట్
తెలంగాణ విముక్తి కొరకు జయశంకర్ గారు చేసిన సేవలు మరువలేనివి.. ఆయన చేసిన మేథోశ్రమ నభూతో నభవిష్యతి.. విద్యార్ధిగా ఉన్నపుడే 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నడు. 1954లో ఫజల్ అలీ కమీషన్ ముందు తెలంగాణ నుప్రత్యేక రాష్ర్టంగా ఉంచాలని వాదించిన్రు. 1955 -56 మద్యకాలంలో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నరు. 1968-69లలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రపోషించిన్రు. తెలంగాణ కోసం పనిచేసే ప్రతి శక్తిని కలుపుకోవాలని పిలుపునిచ్చిండు..
స్పాట్..
1969-1996 మధ్య కాలంలో తెలంగాణ కోసం పని చేసే సంఘాలకు, వ్యక్తులకు పెద్దదిక్కుగా నిలిచిండు. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి, నాలుగేండ్లుగా ఉద్యమాన్ని నడిపించిన్రు. తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దశలోనాయకత్వాన్ని, కార్యకర్తలను, చైతన్యం పరచడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆర్ యస్ యు నుంచి ఆర్ యస్ యస్ వరకు తెలంగాణ కోసం ఎవరు పిలిచినా అరమరికలు లేకుండా ఉద్యమ సభల్లో పాల్గొని తన గొంతు వినిపించేవారు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న దశలో.. తెలంగాణ ఉద్యమ సారధి కేసిఆర్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ ..యావద్భారత రాజకీయ ప్రముఖుల మద్దతు కూడ గట్టడంలో ముఖ్యపాత్రపోషించిన్రు జయశంకర్ గారు. తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసిఆర్ గారే జయశంకర్ గారిని తన గురువుగా భావిస్తరు. ఎందుకంటే 2004 సంవత్సరం నుంచి 2009 నవంబర్ 9 న తెలంగాణ రాష్ర్ట ప్రకటన వెలువడే వరకు అందరు నాయకులను కలిసి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఒప్పించడంలో కేసిఆర్ గారితో బాటు ముఖ్యపాత్ర పోషించిన్రు. మూడు తరాల కడగండ్లను కండ్లార చూసిన సామాజికవేత్త. తెలంగాణలో ప్రతి విషయాన్ని కండ్లకు కట్టినట్టు వివరించిన్రు. అందుకే ఆయనను మీడియా తెలంగాణ సిద్దాంత కర్త అని అభివర్ణించడం అక్షరాలా నిజమే.. నిజాయితీ గల సిద్దాంతకారుడికి నిలువెత్తు నిదర్శనం జయశంకర్ గారు..

జడల రమేష్ జానపద గాయకుడు

ఎ. జనార్ధన్
తెలంగాణ మట్టిలో జానపద గీతాలు జలపాతల్లా జలజలా రాలి పడతయి. పల్లె జనం ఆ జానపద జల్లుల్లో తడిసి పులకిస్తది. ఆ పదాలను తన పెదాలపై అలవోకగా ఆడించగల పల్లెగాయకుడు జడల రమేష్.. పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. తండ్రి రాజవీరు, తల్లి కళావతి. భార్య తేజస్విని, పిల్లలు అపూర్వ, వర్షిత్. బతుకు బాటకు నేత వృత్తిని, బతుకు పాటకు జానపదాన్ని ఎంచుకున్నడు రమేష్..
స్పాట్
రమేష్ .. కండెలు చుట్టడం, సాంచెలు నడపడం అలవోకగా చేయగలడు. ఉగ్గుపాలతో నేర్చుకున్న మగ్గం విద్య ఊరికొయ్యలకు ఎలా పంపుతుందో పాటగట్టిండు. సిరులొలికే సిరిసిల్ల ఉరిసిల ఎలా అయిందో తన పాటలల్లో వివరించిండు. నేతకార్మికుల కష్టాలన్నీ తన పాటల్లో పొదిగిండు. తానే ఖర్చు భరించి నేత బతుకుల పై ఒక ఆడియో సిడి విడుదల చేసిండు. ఇప్పటికి రెండు వేల క్యాసెట్లలో పాడిండు. 5వేల పాటలు పాడిండు. 7 భాషల్లో తన గళమాధుర్యాన్ని నింపిండు.
స్పాట్
ప్రజా కళాకారుడిగా అనేక ప్రజాచైతన్య సభల్లో పాల్గొని ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నించిండు. మొదటి పాట సిరిసిల్ల ఫ్రెండ్స్ ఆర్కెస్ర్టాలో పాడి తన సత్తా చాటిండు. అనేక ధూంధాం సభల్లో పాల్గొన్నడు. ఆద్యాత్మిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటడు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పొషించిండు జడల రమేష్. ఈయన నైపుణ్యానికి ప్రజల నుంచి మంచి ఆధరణ లభించింది. వేములవాడ దేవస్థానం నుంచి ఉత్తమగాయకుడి అవార్డు అందుకున్నడు. హైదరాబాద్ పాత బస్తీలో నిర్వహించిన కచేరీలో వచ్చిన గుర్తింపుకు వెండి కిరీటం బహుకరించిన్రు. కరీంనగర్ లో జరిగన స్వదేశీ జగరణ్ మేళలో జానపద కవిగాయక శిఖామణి అన్నబిరుదునిచ్చి సన్మానం చేసిన్రు. తెలంగాణ బాషలో రామాయణాన్ని రాసి పాడి అమ్మనేనుబోతున్నలంకలోకి పేరుతో వీడియో సిడి చేసిన్రు. ఈ కాసెట్ బహుళ ప్రజాదరణ పొందింది.

స్పాట్
రమేష్ కు నటనలో కూడా మంచి అనుభవం కలదు. అనేక డాక్యుమెంటరీలలో నటించిండు. వివిధ రకాల కళారూపాలలో, నృత్యరూపకాలలో ఆడిపాడిండు.. ప్రజా సేవే తన లక్ష్యమని, పాటద్వారా ప్రజలను చైతన్యం చేస్తనని సగర్వంగా చెప్పుకుంటడు జడల రమేష్.

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.

ఒగ్గు కథకు జీవం చుక్క సత్తెయ్య

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ కళారూపాలలో ఒగ్గుకథకు ప్రత్యేక స్థానం ఉంది.. పల్లెలల్లో ఎనకటి వాళ్లకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచేది ఒగ్గుకథలే.. ఒగ్గుకథలు, బాగోతాలు, బుర్రకథలు, వీధి నాటకాలు ఇవ్వన్నీ అక్కచెల్లెండ్లే. ఇప్పడు డిజిటల్ మాయాజాలం కండ్లవడ్డంక ఈ ఒగ్గు కథలను బొగ్గుల్లో కలిన్రు. అయినా నేటికీ ఆ ఒగ్గు కథను నమ్ముకొని జీవించడమే కాదు.. ఆ ఒగ్గు కథకు జీవం పోస్తున్న కళాకారులు ఎందరో ఉన్నరు. అటువంటి కళాకారుల్లో పేరువడ్డ ఒగ్గుకథకుడే చుక్క సత్తెయ్య ..
స్పాట్
చుక్క సత్తెయ్య పుట్టింది వరంగల్ జిల్లా, లింగాల ఘనపురం మండలం, మాణిక్యాపురం గ్రామం. ఒగ్గుకథలు చెప్పుడు సత్తెయ్యకు వారసత్వంగా వచ్చిందే. సత్తెయ్య కు తండ్రి ఒగ్గుకథ నేర్పిండు. అల్లీరాణీ కథలు అలవోకగా వల్లెవేయగలడు సత్తేయ్య. అంతే కాదు కులపురాణాలు, వీధి భాగోతం ఆయన నాలుకపై నాట్యమాడుతుంటయి.
స్పాట్
చుక్క సత్తెయ్య ఒగ్గుకథ చెప్పుడేందని ఎంతో మంది ఎదురు తిరిగిన్రు. చెప్పొద్దని అడ్డుకున్నరు. కానీ ఆయన కాలు ఆగలే. ఎట్లయితే అట్లయిందని ఎదురు నిలిచిండు. అడ్డు పడ్డోల్ల అడ్రసయితే లేదుగాని ఒగ్గుకథకు ఇప్పుడు సత్తేయ్యే అడ్రసయిండు. ఆయన ఆడని ఆటలేదు. పాడని పాటలేదు. ఇప్పుడొస్తున్న ఎన్నోపాటలకు ప్రాణం ఒగ్గుకథలల్లనే ఉన్నదంటడు సత్తెయ్య.
స్పాట్
తన తండ్రి దగ్గర్నుంచి ఒగ్గుకథలు చెప్పుడు నేర్బుకున్న సత్తేయ్య.. 16 ఏండ్ల సందే కథ చెప్పుడు షురు చేసిండు. తాను కథ చెప్పుడు మొదలేస్తే కూసున్నోళ్లు కథ అయిందనక లేవరంటడు సత్తెయ్య. అంత సక్కంగ చెప్పవట్టే సత్తెయ్య కథ దేశమంతా పాకింది. మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ప్రదేశ్, కేరళ, తేజాపూర్, పాండిచ్చేరి రాష్ర్టాలలో మన ఒగ్గు కథ రుచి చూపించిండు సత్తెయ్య. ఒక్క ఢిల్లీలోనే ఇప్పటికి 26 సార్లు ఒగ్గు కథ చెప్పిండు. 1973 నుంచి ఇప్పటి వరకు ఢిల్లో ఒగ్గుగొంతు వినిపిస్తనే ఉండు. ఏ ఏటికాయేడు తన కథ కొత్తగనే ఉంటదంటడు సత్తెయ్య. అందుకనే ప్రతి యేడు తనను ఢిల్లీ పిలుచుకపోయి కథ చెప్పిస్తరని సగర్వంగా చెప్పుకుంటడు.
స్పాట్
ఒగ్గుకథ నమ్ముకొని జీవిస్తున్న ఈ కళామతల్లి ముద్దుబిడ్డ ఎందరో కళాకారులను తీర్చి దిద్దిండు. ఈయన కృషిని మెచ్చి ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు సత్కరించి సన్మానించిన్రు. రాష్ర్టపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డునందుకున్నడు. కళాసాగర్ అవార్డు కూడా ఈయనను వరించింది. ఇక సన్మానాలు సత్కారాలకు కొదవే లేదు. 20 ఏండ్ల సంది తెలుగు యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యార్ధులకు ఒగ్గుకథ గురించి పాఠాలు నేర్పుతున్నడు.
స్పాట్
1931లో జన్మించిన ఈ తెలంగాణా కళామతల్లి ముద్దుబిడ్డ చేయని పోరు లేదు. తెలంగాణ బిడ్డల ఎతలు కండ్లార జూసిండు గనుకనే బడిత బట్టిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో దూకిండు. 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నడు. 80 ఏండ్ల పై బడ్డా కూడా ఉద్యమాల పాటలు హుషారుగా పాడుతడు. అదే గొంతు వినిపిస్తడు.