29, ఏప్రిల్ 2011, శుక్రవారం

చక్రి మ్యూజిక్ డైరక్టర్

ఎ. జనార్ధన్
తెలంగాణ కళావనంలో గుభాళించిన ఓ స్వర పరిమళం. ఉవ్వెత్తున ఎగసిపడే స్వరఝరి.. సర్వగమకాలను తన స్వరంలోకి ఆవహించిన తెలంగాణ గాన గంధర్వుడు. ఆయనే మన స్వరతరంగం చక్రి.
స్పాట్
సినీ సంగీత వినీలాకాశంలో అత్యంత తక్కువ సమయంలో తారాజువ్వలా దూసుకుపోయిన చక్రి పుట్టింది … ఉద్యమాల పురిటిగడ్డ మహబూబాబాద్.. తల్లి విద్యావతి, తండ్రి వెంకటనారాయణ. బాల్యమంతా సొంత గడ్డపైనే గడిచింది.. చక్రికి సంగీతం ఉగ్గుపాలతోనే అబ్బింది. అమ్మలాలి పాటలు నాన్నా జోల పాటలు చక్రికి సంగీతపు వారసత్వాన్నిచ్చినయి. తండ్రి వెంకటనారాయణ మంచి గాయకుడు, కంపోజర్. అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకుండు చక్రి. మహబూబాబాద్ లో స్కూల్ విద్య పూర్తయినంక వరంగల్లో డిగ్రీ పూర్తి చేసిండు. చక్రి సోదరి “ఆదర్శిణి” కూడా మంచి గాయని, తమ్ముడు “మహిత” త్వరలో మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం కాబోతున్నడు. చక్రి శ్రావ్యమైన సంగీతానికి తోడుగా “శ్రావణి” జీవిత భాగస్వామిగా జతగూడింది. తాను వేసే ప్రతి అడుగు వెనకా తన కుంటుంభ సభ్యుల సహకారం మరువలేనిదని చెప్పుకుంటడు ఈ స్వరశిల్పి.
స్పాట్
చక్రికి చిన్నతనం నుంచే సంగీతమంటే చెప్పలేని అభిమానం. ఆయనకు పాటే ప్రాణం.. వరంగల్ లో డిగ్రీ చదివేటపుడే తన భవిష్యత్తుకు బాటలు వేసుకుండు. సినిమా ఫీల్డ్ లోకి రాక ముందే 40కి పైగా ఆల్బంలు చేసిండు. చల్లగాలి… చిరునవ్వుతో..వంటి ఆల్బంలు చక్రి మంచి పేరు తెచ్చినయి.
స్పాట్
చక్రి ప్రతిభను గుర్తించిన పూరి జగన్నాధ్ తొలిసారి “బాచి” చిత్రంలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చిండు. 2000వ సంవత్సరంలో మొదలైన ఆ ప్రస్థానం నేటికీ సాగర స్వరాల్లా సాగిపోతూనే ఉంది. ఆయన గళం నుంచి జాలువారిన గమకాలెన్నో పల్లెలల్లో సుప్రభాతాలై నిద్దుర లేపుతయి. బాచి నుంచి జైభోలో తెలంగాణ వరకు ఆయన స్వరపరచిన ఎన్నో గేయాలు నిత్య పరిమళ స్వర పుష్పాలై గుభాళిస్తున్నయి.. ఇప్పటి వరకు చక్రి దాదాపు 90 కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన్రు. ఒక్కతెలుగులోనే కాక ఇతర దక్షణాది బాషా చిత్రాలకు కూడా పనిచేసిన్రు. ఇట్లు శ్రావణి సుభ్రమణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, సత్యం, చక్రం, జై భోలో తెలంగాణ వంటి చిత్రాలు ఆయన అందించిన వాడిపోని స్వరపారిజాతాలు.
స్పాట్
చక్రి తాను వచ్చిన దారిని ఎప్పటికీ మరిచిపోలేదు.. స్నేహానికి ప్రాణమిచ్చే చక్రికి.. తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలను కునే మనస్థత్వం. ఎందరో నూతన గాయనీ గాయకులకు అవకాశమిచ్చి వారి ఎదుగుదలకు దారి చూపిండు. అంతేకాదు .. తన పుట్టిన రోజు వంటి స్పెషల్ అకేషన్స్ లో పేదవారికి పాలు పళ్లు పంచిపెట్టడం, బట్టలు కొనివ్వడం, అనాధలకు కావలసిన వస్తువులు అందివ్వడం, రక్త ధాన శిభిరాలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తడు. తనను నమ్ముకొని వచ్చిన వారికి నేనున్నానని అండగా నిలుస్తడు. అందుకే ఆయన మిత్రులు.. చక్రికి బలం, బలహీనత ఆయన మంచితనమేనని చెప్తరు.
స్పాట్
చక్రి ప్రతిభను ఇండస్ట్రీ గుర్తించింది. ఆయన స్వరాలకు నీరాజనం పలికింది. సత్యం సినిమాలో “ ఓ మగువా నీతో స్నేహం కోసం “ పాటకు సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఇదే కాక శంకర్, జయకిషన్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నరు. సంతోషం వంటి అవార్డలు కూడా ఆయన సరసన చేరి తమ విలువ పెంచుకున్నయి. స్వయం కృషితో ఎదిగి ప్రతిభను నమ్ముకున్న చక్రి తెలంగాణ బిడ్డ కావడం మనందరం గర్వించదగ్గ విషయం.
స్పాట్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి