29, ఏప్రిల్ 2011, శుక్రవారం

రామాచారి (సంగీత దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్, సింగర్

ఎ. జనార్ధన్
కొమాండూరి రామాచారి..ఇప్పడీ పేరు తెలియని సంగీత సాధకులు లేరంటే నమ్మలేం.. అంతగా సంగీత సరస్వతి పుత్రుల మదిని దోచిన స్వరసంపాదకుడు రామాచారి.. ఛానళ్లలో ప్రసారమవుతున్న మ్యూజికల్ ప్రొగ్రాంలలో ఆయన శిశ్యులే అధికం.. ప్రతి పదిమందిలో ఒకరు రామాచారి శిశ్యలమని గర్వంగా చెప్పుకుంటరు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మందిని గాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది..ఈ కఠోర తపస్సు వెనక సంవత్సరాల తరబడి చేసిన శ్రమ, పట్టుదల, ఆవేదన. ఆశయం ఉన్నయి. పాటే తన పంచ ప్రాణాలంటడు..తన జీవితమే ఒక పాటని అంటడు..
స్పాట్ (సాంగ్)
సంగీతస్వరసృష్టికర్త రామాచారి పూర్తిపేరు కొమాండూరి రామాచారి.. సినీ పరిశ్రమలో ఈయన్ను శ్రీరామ్ కౌశిక్ గా పిలుచుకుంటరు.. ఈ స్వరశిఖామణి 1964 జనవరి 27న జన్మించిన్రు. తండ్రి కృష్ణమాచార్యులు తల్లి యశోద.. మెదక్ జిల్లా శివంపేట మండలం గొట్టిముక్కల స్వగ్రామం.. రామాచారికి చిన్నప్పటి నుంచి పాటలు పాడటమంటే ఆసక్తి. స్వరమే తన సర్వస్వమని భావించిండు..అంతేకాదు గాయకుడిగా రాణించాలనే బలమైన తపన.. ఆ తపనే తనను సంగీతం వైపు నడిపించింది. బిఎ, బిఇడి డిగ్రీలతో పాటు సంగీతభూషణ్ కోర్సును అభ్యసించింన్రు.. మ్యూజిక్ టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి సంగీతం మాస్టార్ గా కెరీర్ ప్రారంభించిన్రు. తన అనుభవాన్ని జోడించి విద్యార్ధులకు సంగీతంలో మెళకువలన్నీ నేర్పేవారు. వందలమంది విద్యార్ధుల చేత కచేరీలు ఇప్పించడం ఛానళ్లకు పరిచయం చేయండం చేస్తుండే వాడు.. ఆయన తొలిపాట 1979లోఆకాశవాణిలో ప్రసారమై ఖండాంతరాలు వ్యాపించింది. అప్పుడు మొదలైన ఆ సంగీత ప్రస్థానం ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది.. ఇప్పుడు రాష్ర్టంలో రామాచారి అంటే తెలియని వారు లేనంత ప్రాచుర్యం పొందిన తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ రామాచారి..
స్పాట్
రామాచారి తన సంగీత సోపానాలలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నరు..ఒక దశలో తాను పడ్డ కష్టాల కొలిమిలో తన ఆశయం ఆవిరవుతుందేమోనని భయపడ్డడు కూడా.. ఎంతో మందికి టాలెంట్ ఉండి కూడా ప్రొత్సాహంలేక, సరియైన శిక్షణ లేక మరుగున పడుతున్నరని గ్రహించిండు.. అందుకే తాను పడ్డ ఇబ్బందులు మరెవరూ పడకూడదని 1999లో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నెలకొల్పి లేత స్వరపుష్పాలను ఒక్కచోట చేర్చి సంగీత శిక్షణ నిస్తున్నారు. పాడగల ప్రతి శిశువుకూ పైసా తీసుకోకుండా పాటనేర్పుతున్నరు. ఈ ఉచిత సేవ వెనుక మథర్ థెరిస్సా సేవా భావమే స్పూర్తి అని చెప్పుకుంటడు. ఒక సంగీత శిక్షకుడి గానే కాక మంచి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నరు రామాచారి.
స్పాట్
రామాచారి ఎన్నో ప్రైవేట్ ఆల్బంలలో పాటలు పాడిన్రు. సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిండు..శ్వేతనాగు, శ్రీరామదాసు, బాలరామాయణం, సంబరం వంటి చిత్రాలలో పాటలు పాడిన్రు. సమాంతరరేఖలు, బుచ్చిబాబు, పరమానందయ్య శిశ్యుల కథ, వంటి సీరియల్స్లో కూడా పాటలు పాడిన్రు. ఇవికాక అనేక భక్తి గీతాల ఆల్బంలలో స్వరాలాపన చేసిన్రు. ప్రేమలేఖ రాశా సినిమాకు సంగీత దర్శకులుగా పని చేసిన్రు.
స్పాట్
రామాచారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది.. దేశం నలుమూలలా పాడటంతో బాటు దుబాయ్, షార్జా, కువైట్, అమెరికా వంటి దేశాలలో పాటలతో స్వరసమ్మోహితులను చేసిన్రు. ఇప్పటికీ ఎందరో విద్యార్ధులచేత దేశవిదేశాలలో కచేరీలు ఇప్పించే అవకాశం కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నరు.
స్పాట్
రామాచారి సరసన ఎన్నో అవార్డులు చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నయి. కళారాధన, అనురోధ్, శిల్పా ఆర్ట్స్, యువశక్తి వంటి అవార్డులు ఆయన ఖాతాలో చేరినయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నంది అవార్డునిచ్చి సత్కరించింది..రామాచారి సంగీత గమకాల గమనంలో తన సతీమణి సుజాత సహకారం మరువలేనిదని చెప్పుకుంటడు. అంతేకాదు రామాచారి పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా రాణిస్తున్నరు. కుమారుడు సాకేత్, కూతురు సాహితి ఇరువురు కూడా పాటలు పాడటంలో తండ్రికి తగ్గ బిడ్డలుగా తమను తాము రుజువు చేసుకుంటున్నరు. ఆ ఇల్లు సంగీత వనం.. రేపటి స్వర పుష్టాలకు వనమాలి రామాచారి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి